బీజింగ్: జనాభా సంక్షోభంతో సతమతమవుతున్న చైనాలో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో వారి మంచీచెడ్డా చూసుకునేందుకు అవసరమైన మానవ వనరులు రోజురోజుకు తగ్గిపోతుండటంతో వారి స్థానంలో రోబోలను నియమించే పైలట్ ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలంటూ పరిశ్రమ, ఐటీ, పౌర వ్యవహారాల శాఖలు వివిధ సంస్థలను ఆహ్వానిస్తూ సోమవారం ఒక నోటీసు జారీ చేశాయి.
వృద్ధుల సంరక్షణలో రోబోటిక్స్ ఏకీకరణను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోబోలు వృద్ధుల ఆరోగ్యంతో పాటు రోజువారీ కార్యకలాపాలు చూసుకునేలా ఉండేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. తద్వారా వారి కుటుంబ సభ్యులపై కూడా భారం తగ్గుతుంది.