China | బీజింగ్, ఏప్రిల్ 10 : అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కవ్వింపులకు తాము భయపడబోమని, తాము వెనుకడుగు వేయబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. ‘మేము చైనీయులం. కవ్వింపులకు మేము బెదరం. మేము వెనక్కు తగ్గం’ అని నింగ్ స్పష్టంచేశారు. 1953లో అమెరికాతో యుద్ధం సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు మావో జెడాంగ్‌కు సంబంధించిన వీడియోను మావో నింగ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో నిర్ణయించేది మేం కాదు. అమెరికా అధ్యక్షులు ట్రూమన్, ఫిసెన్హోవర్ లేదా తదుపరి అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడి ఉంటుంది. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగినా మేం మాత్రం లొంగేది లేదు. సంపూర్ణ విజయం దక్కే వరకు పోరాడుతాం’ అని మావో ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాపై సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను 34 శాతం నుంచి 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా వస్తువులపై అమెరికా సుంకాలను 145 శాతం పెంచింది.
ప్రతీకార సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకునేలా సమైక్య ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇతర దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. అయితే ట్రంప్‌తో వాణిజ్య యుద్ధానికి జంకుతున్న చాలా దేశాలు చైనాతో జతకట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రపంచ మార్కెట్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ తాను విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే చైనాకు మాత్రం ఇందులో మినహాయింపు ఇవ్వలేదు. అయితే అమెరికాతో తాము చేస్తున్న న్యాయమైన పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజల మద్దతును అమెరికా గెలుచుకోలేదని, చివరకు ఆ దేశానికి ఓటమి ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో చైనా ప్రధాని లీ జియాంగ్ ఫోన్ ద్వారా చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రపంచ దేశాల నాయకుల మద్దతు కూడగట్టగలమని చైనా ఆశిస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు ప్రతిచర్యగా అమెరికన్ సినిమాల దిగుమతిపై చైనా కోత విధించడంతోపాటు బెదిరింపులు మాని న్యాయ సమ్మతమైన చర్చలకు ముందుకు రావాలని అమెరికాకు పిలుపునిచ్చింది. ట్రంప్ చర్యల వల్ల అమెరికన్ సినిమాలపై చైనా ప్రేక్షకులకు ఉన్న సదభిప్రాయం పూర్తిగా అంతమయ్యే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే చైనా చలనచిత్ర పాలనా యంత్రాంగం తెలిపింది.
గువాంగ్జౌ(చైనా), ఏప్రిల్ 10: అమెరికాను దెబ్బకు దెబ్బ తీయాలన్న చైనా ప్రభుత్వ నిర్ణయాన్ని చైనా ప్రజలు కూడా బలపరుస్తున్నారు. అమెరికా భారీ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చైనా ప్రభుత్వం ఓ పక్క తహతహలాడుతుండగా తాము కూడా తగ్గేదేలే అంటూ ఓ చైనీస్ రెస్టారెంట్ ఏకంగా అమెరికన్ కస్టమర్లనే టార్గెట్ చేసింది. తమ రెస్టారెంట్‌ను సందర్శించే అమెరికన్ కస్టమర్లపై భారీ సర్వీసు చార్జీలను ప్రకటించింది. నేటి నుంచి మా రెస్టారెంట్లో అమెరికన్ కస్టమర్లకు 104 శాతం సర్వీసు చార్జీ ఉంటుంది.
మీకేమైనా ప్రశ్నలు ఉంటే అమెరికన్ ఎంబసీని సంప్రదించవచ్చు అంటూ ఆ రెస్టారెంట్ యాజమాన్యం గేటు బయటే నోటీసు బోర్డు పెట్టింది. ఈ చర్య స్థానిక ప్రజలను సంతోష పెడుతుండగా అమెరికన్ పౌరులను మాత్రం ఇరకాటంలో పడేసింది. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు ఇదే నిదర్శనమని చెప్పవచ్చు. చైనా దిగుమతులపై సుంకాలను 104 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ మంగళవారం ప్రకటించిన దరిమిలా చైనాలోని రెస్టారెంట్ కూడా అంతే మొత్తంలో అమెరికన్ కస్టమర్లకు సర్వీసు చార్జీ వడ్డించడం విశేషం.