పాక్ వేదికగా జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాలు ముగిశాయి. ఇస్లామిక్ దేశాల సమావేశాలకు ఎన్నడూ లేని విధంగా చైనా కూడా హాజరైంది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగియడమే ఆలస్యం… హఠాత్తుగా ఆఫ్గన్ పర్యటనకు వెళ్లారు చైనా విదేశాంగ మంత్రి. తాలిబాన్ నేతలతో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలతో సహా.. పలు సమావేశాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ తాలిబాన్ నేతలతో చర్చించారు.
2021 లో కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవడానికి ఇతర దేశాలు తమతో కలిసి రావాలని తాలిబాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి ఏ దేశం కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. చైనా మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ భేటీ ద్వారా అర్థమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు చైనా సర్కార్ తాలిబాన్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. చర్చలు మాత్రం చేసింది.
కాబూల్‌లో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న చైనా?
ముఖ్యమైన ఖనిజాల తవ్వకాలను ప్రారంభించాలని చైనా తలపోసింది. ఆఫ్గన్‌లో లిథియం లాంటి విలువైన ఖనిజాల నిక్షేపాలున్నాయి. వీటిపై చైనా కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాబుల్‌లో చైనా తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగ మంత్రి తాలిబాన్ నేతలతో చర్చలు జరిపారా? అని అనుమానాలు వస్తున్నాయి.