బీజింగ్, డిసెంబర్ 9: ప్రభుత్వ నియంత్రణలోని అసెట్ మేనేజ్మెంట్ సంస్థలో అవినీతికి పాల్పడిన ఒక మాజీ ఎగ్జిక్యూటివ్‌ను చైనాలో మంగళవారం ఉరితీశారు. చైనా హురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (సీహెచ్ఐహెచ్)లో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన బాయ్ తియాన్హ్యూ 2014-18 మధ్య నిధుల విషయంలో కొన్ని ప్రాజెక్టులకు లబ్ధి చేకూర్చడానికి 156 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1400 కోట్లు) లంచం తీసుకున్నాడు.
ఇదే సంస్థకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు కూడా తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. దీంతో ఆరోపణలపై విచారణ జరిపిన తియాన్జిన్లోని న్యాయస్థానం అతనికి 2024 మేలో మరణ శిక్షను విధించింది. దీనిపై ఆయన సుప్రీమ్ పీపుల్స్ కోర్టును ఆశ్రయించగా, ఆయన చేసిన నేరం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం అతని మరణశిక్షను నిర్ధారించింది. దీంతో కుటుంబ సభ్యులతో సమావేశమైన అనంతరం బాయ్‌కు మంగళవారం తియాన్జిన్లో మరణశిక్ష అమలు చేశారు.