(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): అటు ఇరాన్, ఇటు హిజ్బోల్లా ప్రయోగించిన క్షిపణులను, రాకెట్లను గాలిలోనే తుత్తునియలు చేసిన ఇజ్రాయెల్ ‘ఐరన్‌డోమ్’ యావత్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భద్రతకు ఇజ్రాయెల్ తరహా డోమ్ రక్షణ వ్యవస్థ ఎంత అవసరమన్న విషయం ఈ పరిణామంతో అందరికీ తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే.. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల దాడుల నుంచి అమెరికాను రక్షించేందుకు 175 బిలియన్ డాలర్లతో తాము కూడా గోల్డెన్ డోమ్ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
అయితే, డోమ్ ఏర్పాటు విషయంలో అమెరికా ఆలోచనాదశలో ఉండగానే.. చైనా మాత్రం అధునాతన డోమ్ ప్రొటోటైప్‌ను సిద్ధం చేసింది. ప్రాథమిక దశలో దాన్ని విజయవంతంగా పరీక్షించింది కూడా. అంతేకాదు, అమెరికా గోల్డెన్ డోమ్ రక్షణ పరిధి ఆ దేశానికే పరిమితమవుతుండగా, చైనా తీసుకురానున్న ఈ డోమ్ ఏకంగా భూమినంతటినీ కవర్ చేయనున్నది. ఈ మేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ న్యూస్ పేపర్ ఓ కథనంలో వెల్లడించింది.
భూతలం, గగనతలం, సముద్రతలం ఇలా ప్రపంచంలో ఏ చోటు నుంచైనా, ఏ దేశమైనా ప్రయోగించే క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలను క్షణాల వ్యవధిలో పసిగట్టి కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని చేరవేసే అత్యాధునిక డోమ్ సిస్టమ్ ప్రోటోటైప్‌ను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. భూమినంతటినీ కవర్ చేసే ఈ డోమ్ వ్యవస్థకు ‘డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డాటా ప్లాట్‌ఫామ్’గా (ప్రస్తుతానికి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డోమ్‌గా పిలుస్తున్నారు) నామకరణం చేశారు. ఇక, శత్రు దేశాల క్షిపణులను పసిగట్టడంతో పాటు వాటిని ఛేదించే ఆయుధ వ్యవస్థ కూడా ఈ డోమ్‌లో ఉండనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే, తర్వాతి దశల్లో ఈ ఆయుధ సంపత్తిని డోమ్ వ్యవస్థలోకి చేర్చనున్నట్టు సమాచారం.
ఇజ్రాయెల్‌కు ఐరన్ డోమ్, చైనాకు మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డోమ్, అమెరికాకు గోల్డెన్ డోమ్ ఉన్నట్టే భారత్‌కు ప్రస్తుతం ‘ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థ’ అందుబాటులో ఉన్నది. 30 కిలోమీటర్ల దూరంలో, 18 వేల మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా వచ్చే క్షిపణులను, యుద్ధ విమానాలను, రాకెట్లను ఇది ఛేదించగలదు. ఇక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. 2035 నాటికి దేశానికి భద్రతా కవచంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ను తీసుకురావడానికి సైన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు, టీ-డోమ్ పేరిట తైవాన్ కూడా మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నది.