China | చైనా మరోమారు తన వక్రబుద్ధి బయట పెట్టుకున్నది. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు భారత్ తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనలను చైనా అడ్డుకున్నది. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయాలని భారత్‌తోపాటు అమెరికా ప్రతిపాదించాయి.
1267 ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా బ్లాక్ చేసింది. ఒకవేళ సాజిద్ మిర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే, అతడి ఆస్తులు జప్తు చేయడంతో విదేశీ ప్రయాణాలకు అనుమతించరు. గత సెప్టెంబర్‌లో కూడా భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది.
ముంబై 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన సాజిద్ మిర్.. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. అతడి తలపై 50 లక్షల డాలర్ల బహుమతి కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాకిస్థాన్ లో ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం.. సాజిద్ మిర్‌కు 15 ఏండ్లకు పైగా జైలుశిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇంతకుముందు సాజిద్ మిర్ మరణించాడని పాకిస్థాన్ వాదించింది. పాశ్చాత్య దేశాలు పాక్ ప్రకటనను నమ్మక పోవడంతో ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశాయి.