వాషింగ్టన్, ఫిబ్రవరి 22: భారతీయుల కుల జాడ్యం ఎల్లలు దాటి అమెరికాను కూడా కలవరపెడుతున్నది. అక్కడి విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో అగ్రవర్ణాల వారు దళితులు, ఇతర బలహీనవర్గాల పట్ల కుల వివక్షకు పాల్పడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షను నిషేధిస్తూ మంగళవారం చట్టం చేసింది. అమెరికాలో కుల వివక్షను నిషేధించిన మొదటి నగరంగా సియాటిల్ నిలిచింది. భారత సంతతికి చెందిన కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని కౌన్సిల్ 6:1 ఓట్లతో ఆమోదించింది.
‘మా ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. దేశంలో కుల వివక్షను నిషేధించిన మొదటి నగరం సియాటిల్. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని అమెరికా అంతటికీ విస్తరించాల్సి ఉన్నది’ అంటూ సావంత్ ట్వీట్ చేశారు. కౌన్సిల్లో తీర్మానం ఆమోదం పొందగానే జై భీమ్ నినాదాలు వినిపించాయి. అమెరికాలో నివసిస్తున్న దక్షిణాసియాకు చెందినవారు, వలస వచ్చిన ఇతర దేశాలకు చెందిన వారు టెక్ రంగంతో సహా తమ పనిప్రదేశాలలో కుల వివక్షను ఎదుర్కొంటున్నారు అని సావంత్ తెలిపారు. భారతీయ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు భారీ సంఖ్యలో ఉన్న పలు యూనివర్సిటీలు ఇటీవల కుల వివక్షకు వ్యతిరేకంగా నిబంధనలు రూపొందించాయి. కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఇద్దరు ఉద్యోగులు తమ సహోద్యోగిని కులం పేరుతో దూషించడంతో ఈ అంశం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.