వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించారు. జనవరిలో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఇదే విషయమై ట్రంప్‌తో చర్చించేందుకు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో (Justin Trudeau) సిద్ధమయ్యారు. ఇరువురు నేతలు శనివారం భేటీ కానున్నట్లు తెలుస్తున్నది. ఫ్లోరిడాలోని ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ సమావేశం జరుగనుంది. అయితే ఈ భేటీకి సంబంధించి కెనడా ప్రధాని కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే చైనా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తానని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.