Camel flu @ Qatar | ఖతార్‌లో కరోనా మాదిరి కెమెల్ ఫ్లూ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నది. దీంతో ఫిఫా ప్రపంచ కప్ పోటీలను చూసేందుకు వచ్చిన లక్షలాది మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్తలు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. అతిపెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్‌ను చూసేందుకు ఖతార్ వచ్చిన 12 లక్షల మంది అభిమానులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉన్నదని నిపుణులు తెలిపారు. వీరితోపాటు స్థానిక ప్రజలు, ఆటగాళ్ళకు కూడా ఇబ్బంది వస్తుందనే భయం ఉన్నది.
కేమెల్ ఫ్లూ శాస్త్రీయ నామం.. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్). ఇది కరోనావైరస్ కుటుంబానికి చెందిన ఎంఈఆర్ఎస్-కోవ్ వైరస్ వల్ల వస్తుంది. దీని బారిన పడిన వారిలో 35 శాతం మంది అంటే దాదాపు మూడింట ఒకవంతు మంది రోగులు మరణిస్తున్నారు. ఈ వ్యాధి తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో సంభవించింది. ఎంఈఆర్ఎస్ అనేది.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధి. పలు అధ్యయనాల ప్రకారం, వ్యాధి సోకిన జంతువు లేదా రోగితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండటం వల్ల కేమెల్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉన్నది. దీనిని భవిష్యత్‌లో వచ్చే అంటువ్యాధుల జాబితాలో డబ్ల్యూహెచ్ఓ ఇటీవల చేర్చింది.
కొవిడ్, ఎంఈఆర్ఎస్.. ఈ రెండూ కరోనా వైరస్ కారణంగా సంభవిస్తాయి. ఈ రెండింటి వ్యాధి లక్షణాలు కూడా దాదాపు ఒకేమాదిరిగా ఉంటాయి. 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, బలహీన వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉన్నవారు, ఇప్పటికే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కంటే ఎంఈఆర్ఎస్ ప్రాణాంతకమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాఉండగా, 2012 నుంచి కేవలం 2,600 కేమెల్ ఫ్లూ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, మూడేండ్ల వ్యవధిలో 64 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా దాదాపు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందగా.. ఎంఈఆర్ఎస్ ఇప్పటివరకు 27 దేశాలకు వ్యాపించింది.