California storm | కాలిఫోర్నియాను తుఫాన్ కుదిపేసింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే విషాదాన్ని నింపింది. తుఫాన్ ధాటికి ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. వేలాది ఇళ్లు కరెంట్ సరఫరా లేక చీకట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం నుంచి తేమతో కూడిన వాతావరణం కారణంగా తుఫాన్ ఏర్పడింది. శనివారం నుంచి భారీగా వానలు కురుస్తున్నాయి. మరోవైపు మంచు కూడా ముంచెత్తింది. ఉత్తర, మధ్య కాలిఫోర్నియాలో వరదలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.
తుఫాను కారణంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. శాక్రమెంటోలో వరద నీటిలో మునిగిపోయిన వాహనం లోపల డ్రైవర్, శాంటా క్రూజ్లోని లైట్హౌస్ ఫీల్డ్ స్టేట్ బీచ్ వద్ద పడిపోయిన చెట్టు కారణంగా 72 ఏళ్ల వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియా ఎత్తైన ప్రాంతాలలో గత వారంలో 14 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
వరదల కారణంగా హైవే 99, హైవే 50తో పాటు పలు రోడ్లను అధికారులు మూసివేశారు. తుఫాను కారణంగా కాలిఫోర్నియాలో 81 వేల కంటే ఎక్కువ మంది వినియోగదారులు, శాక్రమెంటో, శాన్ జోక్విన్ కౌంటీలలో మెజారిటీ ఇళ్లకు ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరా లేదు. పశ్చిమ నెవాడాలో దాదాపు 30 వేల మంది చీకట్లోనే ఉండిపోయారు. సోమవారం నాటికల్లా వరదలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.