న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వ్యాపార దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి రికార్డులు తిరగరాశారు. 60,000 కోట్ల డాలర్లకు(రూ. 54 లక్షల కోట్లు) మించిన ఆస్తితో ప్రపంచంలోనే ఏకైక అత్యంత సంపన్నుడిగా మస్క్ చరిత్ర సృష్టించారు. ఒక్క రోజులోనే ఆయన సంపద 16,800 కోట్ల డాలర్లు(రూ. 15 లక్షల కోట్లు) పెరగడంతో మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారినట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది.
ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ సోమవారం 67,700 కోట్ల డాలర్లకు చేరుకుంది. మస్క్ సంపద హఠాత్తుగా పెరిగిపోవడంతో ఆయనకు, ఇతర సంపన్నులకు మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. 25,330 కోట్ల డాలర్ల నికర ఆస్తితో ఫోర్బ్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఆస్తిపరుడిగా మస్క్ నిలిచారు.