British MP : జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్‌మన్ (Bob Blackman) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ను భారత్‌లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్‌ను పాకిస్థాన్ (Pakistan) ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా.. 1992లో కశ్మీరీ పండితుల వలసల కంటే ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. జైపుర్‌లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ఆక్రమించడమే కాకుండా.. పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తుండటం సరైన చర్య కాదని బాబ్ బ్లాక్‌మన్ అన్నారు.
గత ఏడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించానని, కానీ పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందని చెప్పారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందని పాక్‌ను హెచ్చరించారు.