Lula da Silva | బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా (76) పదవీ ప్రమాణం చేశారు. లులా మూడోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నడుమ లులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై విజయం సాధించారు. బ్రెజిల్ అధ్యక్షుడిగా బోల్సోనారో నాలుగేండ్ల పాటు కొనసాగారు. తమ అభిమాన నాయకుడి ప్రమాణాన్ని వీక్షించేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు తరలివచ్చారు. లులా డ సిల్వా 2003-2010 మధ్య రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు.
బ్రెజిల్ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం అనంతరం లులా డ సిల్వా మాట్లాడుతూ.. బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గత కొన్నేండ్లుగా కోల్పోయిన హక్కులు, స్వేచ్ఛ, అభివృద్ధిని మళ్లీ దక్కేలా కృషి చేస్తానన్నారు. దేశంలోని పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు జాతి, లింగ సమానత్వం కోసం కృషి చేస్తానని లులా డ సిల్వా వాగ్దానం చేశారు. బోల్సోనారో పేరును ఎత్తకుండా.. ఆయన పాలనలో దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అని లులా ఈ సందర్భంగా హెచ్చరించారు.
బ్రెజిల్ ఎన్నికల్లో లులా డ సిల్వా గెలిచినప్పటి నుంచి బోల్సోనారో మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా అల్లర్లు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లులా డ సిల్వా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీ భద్రత కల్పించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే సందర్శకులు సీసాలు, డబ్బాలు, జెండా కర్రలు, బొమ్మ తుపాకులు తీసుకురావడంపై నిషేధం విధించారు. మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరవడంతో ఓ నల్లజాతి మహిళ నుంచి సాష్ (దేశాధ్యక్షుడు మాత్రమే భుజం నుంచి నడుం వరకు ధరించే వస్త్రం) ను లులా అందుకున్నారు. అధ్యక్షుడి ఎన్నికైన వ్యక్తికి దిగిపోయే వారు ఈ సాష్‌ను అందించడం బ్రెజిల్లో ఆనవాయితీ.