అఫ్గాన్ బాలికలకు బాలుర మద్దతు
కాబూల్, సెప్టెంబర్ 19: అఫ్గానిస్థాన్లో తాలిబన్ విద్యా మంత్రిత్వశాఖ శుక్రవారం నుంచి బాలుర ఉన్నత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. పురుష ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి విద్యాసంస్థలకు వెళ్లాలని పేర్కొన్నది. కానీ, బాలికల పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సమాజంలో సగభాగమైన మహిళలకు కొందరు బాలురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. బాలికల పాఠశాలలు ప్రారంభించేంత వరకు తాము కూడా స్కూళ్లకు వెళ్లబోమని చెప్తున్నారు. అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దేశంలోని బాలికలకు సంఘీభావంగా కొందరు బాలురు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. కొందరు స్కూళ్లకు వెళ్తుండగా మరికొందరు ఇండ్లకే పరిమితమవుతున్నారు.