సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బాండీ బీచ్(Bondi Beach Attack) వద్ద డిసెంబర్ 14వ తేదీన హనుకా సంబరాలు జరుపుకుంటున్న యూదులపై ఇస్లామిక్ తీవ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో 15 మంది మరణించారు. అయితే అనుమానిత సాయుధులు… ఆ బీచ్ వద్ద ముందుగా పేలుడు పదార్థాలు వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక ఆ అటాక్ ప్లానింగ్‌కు ముందు చాన్నాళ్లు ఆ సాయుధులు షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు కూడా ఆస్ట్రేలియా పోలీసులు కోర్టులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు పొందుపరిచారు.
బోండీ బీచ్ అటాక్‌లో డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. వాస్తవానికి ఆ సాయుధులు వాడిన టెన్నిస్ బాల్ బాంబు చివరి నిమిషంలో పేలలేదని తెలిసింది. 24 ఏళ్ల నిందితుడు నవీద్ అక్రమ్‌పై 59 అభియోగాలు నమోదు చేశారు. రెండవ గన్‌మెన్ సాజిద్ అక్రమ్.. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ .. కొన్ని నెలల ముందే అటాక్ కోసం క్షుణ్ణంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది.
దాడికి రెండు రోజుల ముందు ఆ ఇద్దరూ బాండీ బీచ్ వద్ద రెక్కీ వేసినట్లు తెలిసింది. నిందితులకు చెందిన ఫోన్లలో ఉన్న ఫోటోలు, వీడియోలను పోలీసులు సీజ్ చేశారు. వాటిని కోర్టులో ప్రజెంట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన జెండా ముందు కూర్చున్న ఆ ఇద్దరు స్టేట్మెంట్ చేసినట్లు ఓ వీడియోలో ఉన్నది. ఖురాన్‌లోని కొన్ని అరబిక్ పంక్తులను నవీద్ అక్రమ్ వల్లవేసినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాలోని మారుమూల గ్రామంలో తండ్రీకొడుకులిద్దరూ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు.
న్యూ సౌత్ వేల్స్‌లోని మారుమూల ప్రదేశంలో వాళ్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్లు ఓ వీడియోలో గుర్తించారు. దాడికి రెండు రోజుల ముందు బాండీ బీచ్‌కు వచ్చి తమ టెర్రర్ అటాక్ ప్లానింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి ముందు ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్‌కు కూడా వెళ్లినట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్రవాదానికి కేంద్రమైన ఫిలిప్పీన్స్‌లోని ఓ ప్రదేశానికి ఇద్దరూ వెళ్లి వచ్చినట్లు ఆసీస్ పోలీసులు తేల్చారు.