లీవ్, మార్చి 18: ఉక్రెయిన్ ప్రజలే లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా థియేటర్లు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లపై విరుచుకుపడుతున్న పుతిన్ సేనలు పొలండ్‌కు సమీపంలోని లీవ్ నగరంపై తాజాగా క్షిపణులు, బాంబుల మోత మోగించడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. సరిహద్దుల్లోని ఐరోపా దేశాలకు వలస వెళ్తున్న వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు లీవ్‌లోనే ప్రస్తుతం తలదాచుకొన్నారు. శుక్రవారం ఉదయం లీవ్ విమానాశ్రయం సమీప ప్రాంతాలతో పాటు, నగరంలోని పలు నివాస సముదాయాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కీవ్‌పై కూడా రష్యా దాడులను కొనసాగిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లపై బాంబుల మోత మోగిస్తున్నది.
స్కూళ్లు, దవాఖానలు, జనావాసాలపై రష్యా సేనలు దాడులు తెగబడుతుండటాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. పౌరులే లక్ష్యంగా పుతిన్ సేనలు ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఒకవేళ ఇదే నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి పొలిటికల్ చీఫ్ రోజ్మేరీ డికార్లో, ఐరోపా దేశాధినేతలు కూడా ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు. రష్యా దాడులకు వెరవకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని నోబెల్ కమిటీకి ఐరోపా దేశాల నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించండి
ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు సరఫరా, ధరలపై ప్రభావం పడనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సూచించింది. మరోవైపు, రష్యా నుంచి భారత్ రాయితీ ధరతో చమురు కొనుగోలు చేయడంపై విమర్శలు గుప్పించిన అమెరికాకు భారత్ పరోక్షంగా చురకలు అంటించింది. చట్టబద్ధమైన ఇంధన లావాదేవీలపై రాజకీయాలు చేయవద్దని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విషయంలో పుతిన్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు భారత్‌కు విజ్ఞప్తి చేశారు.
రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నటి ఒక్సానా దుర్మరణం
కీవ్‌లోని ఓ బిల్డింగ్‌పై రష్యా సేనలు చేసిన రాకెట్ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ (67) మృత్యువాతపడ్డారు. ఉక్రెయిన్‌లో కొన్ని దశాబ్దాలకాలంగా వెండితెరపై వెలిగిన ఒక్సానా.. థియేటర్ కళాకారిణిగా, నటిగా ఎంతో పేరు తెచ్చుకొన్నారు. దేశంలోని అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకొన్నారు.