Hamas | జెరూసలెం: హమాస్ నిర్బంధంలో ఉన్న ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. వీరిని కాపాడేందుకు తమ సైన్యం గాజాకు చేరుకోవడానికి కొద్ది సేపటి ముందు వీరిని హమాస్ ఉగ్రవాదులు హత్య చేశారని తెలిపింది. దీంతో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు ఇజ్రాయెలీలు పిలుపునిస్తున్నారు.
10 నెలల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ముగించి, హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని సజీవంగా తీసుకురావడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు స్పందిస్తూ, బందీలను హత్య చేయడంతో హమాస్ ఉగ్రవాద సంస్థకు కాల్పుల విరమణ ఒప్పందం అక్కర్లేదని రుజువైందన్నారు. వారిని వేటాడి అంతమొందిస్తామని ప్రతినబూనారు. హమాస్ ఉగ్రవాదులు గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి, సుమారు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.