వాషింగ్టన్: అమెరికాలో బర్డ్ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్ కేసులు ఉధృతంగా ఉన్న లూసియానా రాష్ట్రంలో తొలి మరణం నమోదైంది. బర్డ్ ఫ్లూ వైరస్ బారినపడ్డ 65 ఏండ్ల వ్యక్తి సోమవారం మృతి చెందాడని వైద్య అధికారులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
ఇంటి వద్ద పక్షుల నుంచి ఆయనకు బర్డ్ ఫ్లూ సోకి ఉండవచ్చునని చెప్పారు. మ్యుటేషన్ చెందిన బర్డ్ ఫ్లూ వైరస్ ఆయన మృతికి కారణమైందని తెలిపారు. అమెరికాలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ బారినపడిన వారి సంఖ్య 66కు చేరుకుంది. వీళ్లలో చాలామంది పౌల్ట్రీ, డైరీల్లో పనిచేయటం ద్వారా వైరస్ బారినపడ్డారని వైద్యులు నిర్ధారించారు.