Queen Camilla | బ్రిటీష్ రాణి కెమిల్లా ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముక్కు భాగం ధ్వంసమైంది. ఇండియా నుంచి బయల్దేరిన ఈ విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విమానంలో ప్రయాణిస్తున్న కెమిల్లా సహా అందరూ క్షేమంగా ఉన్నారని లండన్ హీత్రూ విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 777 – 200ER విమానం బెంగళూరు నుంచి లండన్‌కు వెళ్తున్నది. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిన్నది. పైలట్ తెలివితేటలతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో బ్రిటన్ రాజు చార్లెస్-III సతీమణి క్వీన్ కెమిల్లా ప్రయాణిస్తున్నారు. ఈ సంఘటనపై బకింగ్‌హామ్ ప్యాలెస్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదని డైలీ మెయిల్ పత్రిక నివేదించింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. కెమిల్లాతో పాటు ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
సౌక్య హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను సందర్శించేందుకు క్వీన్ కెమిల్లా బెంగళూరు వచ్చారు. ఇక్కడి మెడికల్ గార్డెన్‌ను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సంగీత కచేరీలో పాల్గొని వైద్యులతో సంభాషించారు. కెమిల్లా తన స్నేహితులతో కలిసి 10 రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరు వచ్చారు. గత 12 ఏండ్లలో ఆమె 7 సార్లు బెంగళూరును సందర్శించారు.