US Aid to Ukraine | రష్యా దాడితో ఇబ్బందుల్లో చిక్కుకున్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు తాజాగా అమెరికా ముందుకు వచ్చింది. ఉక్రెయిన్‌కు 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా చట్టసభలు ఆమోదించిన చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో నెలకు చేరనున్నది. అమెరికా అందించే సాయంలో సగం మిలిటరీ అవసరాలకే ఉపయోగిస్తారు. ద్వైపాక్షిక మద్దతు కోసం ఉక్రెయిన్‌కు అమెరికా ఈ సాయం అందచేస్తున్నది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆ దేశ సైన్యం విజయవంతంగా రక్షించుకోగలిగింది. మరోవైపు ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి సారించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.
సెప్టెంబర్ నాటికి ఉక్రెయిన్‌కు అమెరికా నిధులు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు ఉక్రెయిన్‌కు అమెరికా 13.6 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం అందజేసింది. ఇప్పుడు అందజేస్తున్న సాయంలో 20 బిలియన్ల డాలర్లు మిలిటరీ అసిస్టెన్స్‌గా వాడుతారు. రష్యా సేనలను అడ్డుకునేందుకు అవసరమైన ఆయుధాలు అందచేయనున్నది అమెరికా. 800 కోట్ల డాలర్ల సాయం జనరల్ ఎకనమిక్ సపోర్ట్, ప్రపంచ ఆహార కొరతకు 500 కోట్ల డాలర్ల సాయం, 100 కోట్ల డాలర్లు శరణార్థులను ఆదుకునేందుకు ఖర్చు చేస్తారు.