Richard Verma | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఇండియన్ అమెరికన్‌కు ఉన్నత స్థానం కల్పించారు. దౌత్యవేత్త రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత దౌత్య స్థానానికి బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం శుక్రవారం రిచర్డ్ వర్మ నామినేషన్‌ను ప్రకటించింది. వైట్‌హౌస్ ధ్రువీకరణ ప్రకారం ఆయన మేనేజిమెంట్ అండ్ రిసోర్సెస్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తారు. ఇది స్టేట్ డిపార్ట్మెంట్లో అత్యున్నత ర్యాంక్. 54 ఏండ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్‌లో చీఫ్ లీగల్ ఆఫీసర్ అండ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా ఉన్నారు. 2015 జనవరి 16 నుంచి 2017 జనవరి 20 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేశారు.
బరాక్ ఒబామా హయాంలో లెజిస్లేటివ్ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా కూడా రిచర్డ్ వర్మ పనిచేశారు. వర్మ తన కెరీర్లో ముందుగా యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ హ్యారీ రీడ్కి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆసియా గ్రూప్ వైస్ ఛైర్మన్‌గా, స్టెప్టో అండ్ జాన్సన్ ఎల్ఎల్పీలో భాగస్వామి, సీనియర్ కౌన్సెలర్‌గా, ఆల్బ్రైట్ స్టోన్బ్రిడ్జ్ గ్రూప్‌లో సీనియర్ కౌన్సెలర్‌గా పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో జడ్జి అడ్వొకేట్‌గా క్రియాశీలకంగా సేవలిందించారు.
లేహి యూనివర్శిటీ నుంచి బీఎస్ పట్టా అందుకున్న రిచర్డ్ వర్మ.. అక్కడే న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదివారు. జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి విశిష్ట సేవా పతకం, కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ ఆఫైర్స్ ఫెలోషిప్, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు.