Berlin Power cut : జర్మనీ రాజధాని బెర్లిన్ రెండు రోజులుగా చీకట్లోనే మగ్గుతోంది. తీవ్ర బ్లాకౌట్ కారణంగా 2 రోజులుగా కరెంటు లేక అల్లాడుతోంది. విద్యుత్ సరఫరా చేసే కేబుళ్లను కొందరు కావాలనే కట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అనుమానిస్తున్నారు. పవర్ కట్ కారణంగా 45,000 ఇండ్లు, 1,120 సంస్థలు చీకట్లోనే ఉన్నాయి. అసలే శీతాకాలం, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్న తరుణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
అయితే, దీని వెనుక తీవ్రవాద కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాల్ని అక్కడి ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ రాజధానిలో ఇలా రెండు రోజులపాటు పవర్ కట్ కావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ పరిస్థితికి తామే కారణం అని అక్కడి వామపక్ష సంస్థ అయిన వల్కన్ గ్రుప్పే ప్రకటించుకుంది. దీనిపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు. తీవ్రవాద చర్య ఉందనే అనుమానం నేపథ్యంలో ఆర్మీని కూడా రంగంలోకి దించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపజేస్తున్నారు. టెంపరేచర్ భారీగా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం, చారిటీ సంస్థలు రంగంలోకి దిగాయి.
మైనస్ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా హోటళ్లు, స్కూళ్లు, స్పోర్ట్స్ సెంటర్లను వామ్ (warm shelters) షెల్టర్లుగా మార్చి, సేవలందిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, బస్సు సేవల్ని కూడా ప్రజలు వెచ్చదనం కోసం వినియోగించుకోవచ్చని అధికారులు కోరారు. స్థానికులు ఎవరైనా వెచ్చదనం కోసం హోటళ్లలో ఉంటే వాటికి తామే బిల్లులు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే బెర్లిన్ లో విద్యుత్ పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు.