టెల్ అవీవ్, జూన్ 17 : ఇరాన్ క్షిపణులు ఐరన్ డోమ్ను దాటి లక్ష్యాలను చేరుకుంటుండడంతో ఇజ్రాయెల్ సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థ ‘బరాక్ మాగెన్’ లేదా ‘మెరుపు కవచం’ను రంగంలోకి దించింది. క్షిపణులు, డ్రోన్ల దాడులను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్ విజయవంతంగా అడ్డుకునేది. అయితే ఇరాన్ క్షిపణులు దానిని ఛేదించుకొని వచ్చి నిర్దేశిత లక్ష్యాలపై పడుతున్నాయి. దీంతో ఆదివారం రాత్రి నుంచి బరాక్ మాగెన్ను ప్రవేశపెట్టామని, అది ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా నిలువరించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ నౌకా దళం ఈ బరాక్ మాగెన్ వ్యవస్థను తమ దీర్ఘశ్రేణి వైమానిక రక్షణ నిరోధకంతో పాటు వినియోగించి ఎనిమిది ఇరాన్ డ్రోన్లను నేలకూల్చిందని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఇజ్రాయెల్ జలాల్లో మోహరించి ఉన్న క్షిపణి వాహక నౌక సార్-6 నుంచి బరాక్ మాగెన్ నిరోధక వ్యవస్థను ఉపయోగించినట్టు పేర్కొంది.
బరాక్ మాగెన్ అంటే హెబ్రీ భాషలో మెరుపు కవచం అని అర్థం. గగనతలం నుంచి జరిగే డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, ఖండాంతర క్షిపణి దాడుల నుంచి యుద్ధ నౌకలను కాపాడుకొనేందుకు ఇజ్రాయెల్ ఈ బరాక్ మాగెన్ను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలో స్వల్పశ్రేణి, మధ్యశ్రేణి, దీర్ఘశ్రేణి నిరోధకాలు ఉంటాయి. ఏ దిశ నుంచి దాడి జరిగినా ఇవి విజయవంతంగా నిరోధించగలుగుతాయి. స్వల్ప, మధ్యశ్రేణి నిరోధకాలు 35 కిలోమీటర్ల దూరంలోనే ముప్పును ఎదుర్కొని ధ్వంసం చేస్తుంది. బరాక్-8ను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్ భారత్తో కలిసి పనిచేసింది. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఉపరితలం నుంచే ఎదుర్కొనే ఈ వ్యవస్థను డీఆర్డీఓతో కలిసి ఇజ్రాయెల్ రూపొందించింది. వంద కిలోమీటర్ల దూరంలోనే శత్రుదేశ క్షిపణులను ఇది అడ్డగించి మట్టుబెడుతుంది.