Bangladesh violence : బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసలో ఇప్పటివరకు 39 మంది ఆందోళనకారులు మరణించారు. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు. గురువారం ఒక్కరోజే 19 మంది ఆందోళనకారులు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లలో 30 శాతం కోటా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు బుధవారం రెండు బస్సులకు నిప్పు పెట్టారు.
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్నిచోట్ల అధికార అవామీ లీగ్ విద్యార్థి సంఘం నాయకులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు జరిగాయి. గురువారం రాంపురా ప్రాంతంలోని టెలివిజన్ భవన్లో మీడియా ప్రతినిధులతో సహా చాలామంది చిక్కుకుపోయారు.
పరిస్థితి అదుపుతప్పడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పరిస్థితిని సమీక్షించారు. భద్రతా బలగాలను రంగంలోకి దించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యాసంస్థలు, మదర్సాలను మూసివేయాలని, మెట్రో రైల్సేవలను నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవద్దని అధికారులు ఆదేశించారు.