Bangladesh | బంగ్లాదేశ్, నవంబర్ 14 : బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జామన్ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు వినిపించారు. దేశంలో 90 శాతం మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదని అన్నారు.
15వ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ మేరకు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆ దేశ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను జాతిపితగా పిలవడం పట్ల కూడా అభ్యంతరం తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కృషిని కాదనలేమని, కానీ జాతిపితగా కీర్తించడం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించేలా రాజ్యాంగం ఉండాలని కోరారు.