ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతిపెద్ద స్లమ్ కోరలిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 1,500కు పైగా ఇళ్లు కాలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, గర్భిణులు, పిల్లలు రాత్రంతా చలిలోనే గడిపారు. వంట గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగిందని, బుధవారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చినట్టు అధికారులు చెప్పారు.
పక్కపక్కనే ఇళ్లు ఉండటంతో మంటలు వేగంగా ఒక ఇంటి నుంచి మరోదానికి వ్యాపించాయని తెలిపారు. 160 ఎకరాలలో విస్తరించి ఉన్న కోరలిలో 80 వేల మంది నివసిస్తున్నారు. క్షణాల్లోనే ఇల్లు, ఇంటిలోని సామాన్లు బుగ్గి అయిపోయాయని, కేవలం కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు. కాగా, బాధితులను ఆశ్రయ కేంద్రాలకు తరలించామని, గాయపడ్డ వారికి దవాఖానలలో చికిత్స అందజేశామని, ప్రమాదంలోంచి బయటపడిన ఒక గర్భిణి గురువారం ఉదయం ఒక బిడ్డను ప్రసవించిందని అధికారులు తెలిపారు.