ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది. మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినవారంతా విచారణను ఎదుర్కొనాలని చెప్పింది. ఆమెతోపాటు విదేశాలకు పారిపోయిన ఇతరులను రప్పించేందుకు కూడా ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు తెలిపింది.
హసీనా, ఆమె పార్టీ నేతలు జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని కిరాతకంగా అణచివేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరి ఆదేశాల కారణంగా అనేక మంది నిరసనకారులు మరణించారని కేసులు నమోదయ్యాయి. ఈ ఉద్యమం తీవ్రతరమై, పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగింది. దీంతో హసీనా ఆగస్టు 5న భారత దేశానికి చేరుకున్నారు.