Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ వితంతు మహిళ (40)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. ఈ ఘటన సెంట్రల్ బంగ్లాదేశ్ లోని, జెనైద్ జిల్లా, కాళిగంజ్ ప్రాంతంలో జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు కొంతకాలం క్రితం షహీన్ అనే వ్యక్తి నుంచి అక్కడ కొంత స్థలంతోపాటు, రెండంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి షహీన్ ఆమెను పలురకాలుగా వేధించాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న షహీన్, హసన్ అనే వ్యక్తితో కలిసి వచ్చి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. బాధితురాలి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె బంధువులపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళపై మరింతగా దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులకు ఆమె అత్యాచారం గురించి చెప్పలేదు. కానీ, వైద్యం అందిస్తున్న సమయంలో ఆమె అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపు చంద్రదాస్ ను దాడి చేసి చంపేయగా, మరో హిందూ ఖోకోన్ చంద్ర దాస్ పై దాడి చేయగా అతడు కూడా మరణించారు. మరికొందరిపై కూడా ఇలాగే దాడులు జరిగాయి.