ఢాకా, ఫిబ్రవరి 13: లండన్‌లో 17 ఏళ్లపాటు స్వీయ ప్రవాస జీవితాన్ని గడిపిన తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్‌కు కొత్త ప్రధాని కానున్నారు. ఆయన తండ్రి స్థాపించిన పార్టీ 20 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వస్తున్నది. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) 297 సీట్లలో 209 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మెజారిటీకి అవసరమైన 150 సీట్లను బీఎన్పీ అధిగమించడంతో బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు బీఎన్పీ చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్‌కు మార్గం సుగమమైంది.
పాకిస్థాన్‌కు సన్నిహితమని భావించే 11 పార్టీల కూటమి జమాత్-ఎ-ఇస్లామీ 68 స్థానాలను గెలుచుకుంది. జమాత్ అధినేత షఫీఖుర్ రహ్మాన్ ఢాకా-15 స్థానంలో విజయం సాధించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఆవామీ లీగ్ 2008 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది. కాగా, రెండు స్థానాల నుంచి పోటీచేసిన తారిఖ్ రహ్మాన్ రెండింటిలోనూ గెలుపొందారు. దాదాపు 17 ఏండ్ల ప్రవాస జీవితం తర్వాత గత డిసెంబర్లో ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చారు.
గడచిన 35 ఏండ్లలో బంగ్లాదేశ్‌కు మొదటిసారి పురుష ప్రధాని రానున్నారు. చివరిగా 1988లో కాజీ జాఫర్ అహ్మద్ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1991 నుంచి 2025 వరకు షేక్ హసీనా, ఖలీదా జియా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని బీఎన్పీ నాయకుడు ఆమిర్ ఖుస్రూ మహమూద్ చౌదరి బీబీసీకి తెలిపారు. తారిఖ్ రహ్మాన్ తమ నాయకుడు, చైర్మన్ అని, బీఎన్పీ ప్రభుత్వంలో ఆయనే ప్రధానిగా ఉంటారని చౌదరి చెప్పారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎంపీలు ప్రమాణం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్పీ చైర్మన్ తారిఖ్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నేరుగా ఫోన్లో శుభాకాంక్షలు తెలియచేశారు. రహ్మాన్‌తో మాట్లాడడం సంతోషంగా ఉందని ఎక్స్ పోస్టులో మోదీ తెలిపారు. అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ సహకారం ఉంటుందని రహ్మాన్‌కు తెలియచేసి, శుభాకాంక్షలు అందచేసినట్లు మోదీ పేర్కొన్నారు. సన్నిహిత పొరుగుదేశాలైన తమ మధ్య సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. శాంతి, ప్రగతి, బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షల సాధనకు భారత్ సహకారం కొనసాగుతుందని ప్రధాని తెలిపారు.
బ్రిటన్‌లో దాదాపు 17 సంవత్సరాలపాటు ప్రవాస జీవితాన్ని గడిపిన మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ ఈ ఏడాది జనవరి 25న బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చారు. తన తల్లి ఖలీదా జియా మరణానికి ఐదు రోజుల ముందే ఆయన స్వదేశానికి తిరిగివచ్చారు. తన తల్లి మరణానంతరం ఆయన బీఎన్పీకి పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. 2001-2006 ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో రహ్మాన్ కీలక పాత్ర పోషించారు.
ఆ సమయంలో రహ్మాన్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను విపక్షాలు డార్క్ ప్రిన్స్‌గా అభివర్ణించేవి. 2007లో ఆయన 18 నెలలు జైలులో గడిపారు. 2008లో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన లండన్‌కు పారిపోయారు. అక్కడే 17 ఏండ్ల్లు ప్రవాస జీవితాన్ని గడిపారు. బంగ్లాలో లేనప్పటికీ బీఎన్పీ రాజకీయ వ్యూహాలను ఆయన లండన్ నుంచే రచించేవారని టైమ్ మ్యాగజైన్ రాసింది.