ఢాకా: భారత్-బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం జరుగుతున్నది. ఈక్రమంలో రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (GRSE) తయారుచేస్తున్నది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్కు జీఆర్ఎస్ఈ వెల్లడించింది.
భారత ఓడరేవులను బంగ్లాదేశ్ ఉపయోగించుకోవడంతోపాటు రోడ్డు మార్గంలో వచ్చే బంగ్లా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18న నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఒప్పందాన్ని ఢాకా రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, వంటి వాటిని మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు ఐదు వారాల క్రితం ట్రాన్స్షిప్మెంట్ అవగాహనను భారత్ రద్దు చేసింది.. దీనివల్ల ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.