ఢాకా, ఫిబ్రవరి 25 : దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తనకు కనపడుతోందని మంగళవారం ఆయన తెలిపారు. దేశం సురక్షిత హస్తాలలో ఉండాలన్నదే తన ఆకాంక్షని, గత 7-8 మాసాలలో తాను ఎంతో చూశానని ఆయన చెప్పారు. తాను ముందుగానే తిరుగుబాటు గురించి హెచ్చరిస్తున్నానని, రేపు ఎందుకు చెప్పలేదని తనను నిందించవద్దని ఆయన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్ జమాన్ ఆందోళన చెందుతున్నారని, దేశాన్ని విదేశీ శక్తులు నడిపిస్తున్నాయని ఆయన భావిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో వెంటనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని ఆయన రాజకీయ పెద్దలకు సూచిస్తున్నారని, లేని పక్షంలో సైన్యం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుదని ఆయన హెచ్చరిస్తున్నారని వర్గాలు తెలిపాయి.