Bangladesh : బంగ్లాదేశ్లో ఒక పక్క హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతుంటే వీటిని అడ్డుకోవాల్సిన అక్కడి ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. హంతకులు, ఆందోళనకారులకు రక్షణ కల్పించే చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనా తర్వాత ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్కడ ఆందోళనలు ఎక్కువయ్యాయి.
పోలీసులు, భద్రతా బలగాలతోపాటు హిందువులపై, రాజకీయ ప్రత్యర్థులపై ఆందోళనకారులు దాడులు, హత్యలు చేశారు. గత ఏడాది జులై- ఆగష్టు సమయంలో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. ఈ ఘటనల్లో పోలీసులతోపాటు హిందువులు, ఇతర పౌరులు మరణించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన యూనస్ ప్రభుత్వం ఇప్పుడు వారికి అండగా నిలిచింది. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రొటెక్షన్ అండ్ లయబిలిటీ డిటర్మినేషన్ ఆర్డినెన్స్ 2026ను ఆదివారం అర్ధరాత్రి జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఘటనల్లో నిందితులకు రక్షణ ఉంటుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. నిందితులపై ఇప్పటివరకు నమోదైన సివిల్, క్రిమినల్ కేసుల్ని రద్దు చేస్తారు.
అలాగే కొత్త కేసులు నమోదు చేయడానికి వీల్లేదు. దీంతో జూలై, ఆగష్టులో పోలీసులు, హిందువులు, మైనారిటీలు, అవామీ లీగ్ సభ్యుల్ని చంపిన వారిపై చర్యలుండవు. ఇస్లామిస్టులు, అతివాదులు అయిన హంతకులు ఇకపై స్వేచ్ఛగా తిరుగుతారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అప్పట్లో ఆందోళనకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లు కూడా తగలబెట్టేశారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశారు. అక్కడ ఏడాదిన్నర కాలంగా హసీనా పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి.
ఈ ఘటనల్లో గత అక్టోబర్ వరకు 44 మంది పోలీసులు మరణించినట్లు అక్కడి నివేదికలు తెలిపాయి. ఆగష్టు 5, 2024న బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయింది. తనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.