అబుజా: నైజీరియాలో మరోసారి రక్తం ఏరులై పారింది. తుపాకులు ధరించిన ముష్కరులు మారణకాండకు పాల్పడ్డారు. ఈ వారం పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ శనివారం తెలిపింది. బందిపోట్ల దాడుల్లో హత్యకుగురైన 143 మందిని తాము పాతిపెట్టినట్లు జంఫారా రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయకుడు బలరాబే అల్హాజీ తెలిపారు.
కాగా, బుధవారం నుండి గురువారం వరకు అంకా, బుక్కుయుమ్ జిల్లాల్లోని పది గ్రామాలలో మోటారు బైక్‌లపై వచ్చిన వందలాది ముష్కరులు విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులను కాల్చివేసి, దోపిడికి పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారని ఆరోపించారు. పది గ్రామాల పరిధిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తున్నామని, మృతుల సంఖ్య ఇంకా తేలలేదని స్థానికులు తెలిపారు. అయితే ఈ రక్తపాతాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
మరోవైపు వాయువ్య, సెంట్రల్ నైజీరియాలో కొన్నేండ్లుగా క్రిమినల్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయి. హింసాకాండ ఇటీవల మరింతగా పెరిగింది. కాగా, ఇలాంటి దారుణాలకు పాల్పడే బందిపోట్లను ఉగ్రవాదులుగా నైజీరియా ప్రభుత్వం ముద్ర వేసింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించింది.