ఒట్టావా : కెనడాలో తుపాకుల విక్రయాలు, దిగుమతిపై నిషేధం విధిస్తూ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కెనడా పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. హ్యాండ్ గన్ ఓనర్‌షిప్‌పై నిషేధాన్ని అమలు చేసేందుకు చట్టం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అమెరికా పాఠశాలలో కాల్పుల ఘటన నేపథ్యంలో కెనడా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. హ్యాండ్‌గన్ ఓనర్‌షిప్‌పై చట్టాన్ని పార్లమెంట్‌లోకి తీసుకురానున్న నేపథ్యంలో ఆమోదం పొందడం జస్టిన్ ట్రూడోకు సవాల్‌గా మారున్నది. ఎందుకంటే అధికార పార్టీకి పార్లమెంట్లో సీట్లు తక్కువగా ఉండడమే
కారణం.
ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ హ్యాండ్ గన్ మార్కెట్‌ను పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్న ట్రూడో.. తుపాకీ హింస పెరుగుతున్నట్లు అంగీకరించారు. అయితే, కెనడాలో అన్ని హింసాత్మక ఘటనల్లో తుపాకీ ప్రమేయం ఉన్న నేరాలు మూడు శాతం కంటే తక్కువగా ఉన్నాయని కెనడా ప్రభుత్వ గణాంకాల ఏజెన్సీ గత వారం తెలిపింది. కానీ, తుపాకీతో బెదిరింపుల తలసరి రేటు 2009 నుంచి దాదాపు మూడురెట్లు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో జరిగిన తుపాకీ నేరాల్లో మూడింట రెండు వంతుల గన్ను వినియోగించారు. కెనడాలో మిలియన్ హ్యాండ్గన్లు ఉన్నాయని పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ మార్కో మెండిసినో ఇంతకు ముందు ప్రకటించారు.