Canada Ban | కొత్త సంవత్సరంలో కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. కెనడాలో విదేశీయులు ఇళ్ల కొనుగోలుపై విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. స్థానికుల ఇళ్ల కొరతను అధిగమించేందుకు కెనడా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం భారత్, చైనా పెట్టుబడిదారులకు హెచ్చరికగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని అభ్యర్థి జస్టిన్ ట్రూడో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలుచేస్తున్నారు. అదేవిధంగా, ఇప్పటివరకు స్టడీ, పీఆర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుని గతేడాది పెద్ద సంఖ్యలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి కూడా కెనడా ప్రభుత్వం షాకిచ్చింది.
కెనడాలో విదేశీయులు ఆస్తులు కొనుగోలు చేయకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం భారతీయులతో పాటు కెనడాకు వెళ్తే విదేశీయులెవరూ ఇప్పుడు అక్కడ ఆస్తులు కొనుగోలు చేయలేరు. కెనడా పెద్ద మొత్తంలో ఇళ్ల కొరతను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో విదేశీయులు నివాస ప్రాపర్టీలను కొనుగోలు చేయకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ ఏడాది ప్రారంభం నుంచే మొదలైంది. ఈ పరిమితి నగర నివాసాలకు మాత్రమే వర్తిస్తుందని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. వేసవి కాటేజీల వంటి ప్రాపర్టీలకు ఈ పరిమితి వర్తించదు. కెనడాలో గృహ కొనుగోలుదారుల డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. ఇళ్లు ప్రజల కోసమే కానీ, పెట్టుబడిదారుల కోసం కాదని ప్రభుత్వం కొంతకాలంగా స్పష్టం చేస్తూ వస్తున్నది.
2021 ఎన్నికల సమయంలో విదేశీయులు నివాస ప్రాపర్టీల కొనుగోలుపై నిషేధం విధిస్తానని ప్రధాని అభ్యర్థి జస్టిన్ ట్రూడో హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏడాది తర్వాత ఈ మేరకు చట్టం తీసుకొచ్చి అమలుచేస్తున్నారు. కొత్త చట్టంలో శరణార్థులు, పర్మినెంట్ రెసిడెంట్స్‌కు మాత్రం మినహాయింపునిస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నాన్-కెనడియన్స్ చట్టం ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేసింది. కెనడాలో పెరుగుతున్న ధరల కారణంగా చాలా మంది ప్రజలు ఇల్లు కొనలేకపోతున్నారు. స్థానికులకు మేలు జరిగేలా కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పలువురు పెట్టుబడిదారులు చెప్తున్నారు.