Balochistan | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్‌తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ పక్కలో బల్లెంలా మారింది. బలూచిస్థాన్‌ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ), ఇతర వేర్పాటువాద గ్రూప్‌లు అడుగులు వేస్తున్నాయి. తాము స్వాతంత్య్రం పొందామని బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. బలూచిస్థాన్‌లో వరుస దాడులతో పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
భారత్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసేందుకు పాక్ సైన్యం ప్రణాళికలు రచిస్తుంటే.. బలూచిస్థాన్‌లో కీలక ప్రాంతాలపై బీఎల్ఏ పట్టు సాధిస్తున్నది. బాంబుదాడులు, బుల్లెట్లతో విరుచుకుపడుతూ అక్కడ గస్తీ కాస్తున్న పాక్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మొత్తంగా ఇటు తూర్పు ప్రాంతమైన భారత్ నుంచి, అటు పశ్చిమ ప్రాంతమైన బలూచిస్థాన్ నుంచి జరుగుతున్న దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రస్తుతం పాకిస్థాన్ సైనిక సంపత్తి, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలను బేరీజు వేస్తే.. అతి త్వరలో పాకిస్థాన్ రెండు ముక్కలు కావొచ్చని, బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా అవతరించే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న దాడులు..
బలూచిస్థాన్‌లో బీఎల్ఏ, రెబల్స్ గ్రూప్స్ కలిసి కొంత కాలంగా పాక్ సైన్యంపై, ప్రభుత్వ ఆస్తులపై వరుసగా దాడులు చేస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో బీఎల్ఏ, రెబల్స్ దాడులు చేసినట్టు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో గురువారం నాలుగు చోట్ల దాడులు జరిగినట్టు స్థానిక రేడియో జుంబేష్ ఇంగ్లిష్ తెలిపింది. క్వెట్టా వ్యాప్తంగా పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినట్టు వెల్లడించింది.
‘మేం క్వెట్టాతోపాటు బలూచిస్థాన్ వ్యాప్తంగా అనేక సైనిక పోస్టులపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నాం’ అని బీఎల్ఏ తెలిపింది. కెచ్, మస్టంగ్, కచి ప్రాంతాల్లో పాక్ సైన్యంపై ఆరు దాడులు చేసినట్టు వెల్లడించింది. దాడులకు సంబంధించిన వీడియోలను వేర్పాటువాదులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీఎల్ఏ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపిన వివరాల మేరకు బలూచిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్ బహోట్ బలూచ్ గురువారం ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దీని ప్రకారం.. బలూచిస్థాన్‌కు కెచ్ జిల్లాలోని దస్తక్ ప్రాంతంలో బీఏల్ఏ రిమోట్ కంట్రోల్ ఐఈడీని పేల్చడంతో బాంబు డిస్పోజబుల్ స్కాడ్‌కు చెందిన ఒక సైనికుడు అక్కడికక్కడే మరణించాడు. అదే జిల్లాలోని కెట్గాన్ ప్రాంతంలో పాకిస్థాన్ ఔట్‌పోస్ట్‌పై దాడిచేసి పలువురు సైనికులను హతమార్చారు. జమురాన్ షా డ్యామ్ ప్రాంతంలో ఐఈడీతో పాక్ ఆర్మీ వాహనాలను ధ్వంసం చేశారు. ‘బలూచ్ వీరులు ఇప్పుడు నేరుగా పాక్ సైన్యంతో వీధుల్లో పోరాడుతున్నారు. ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. మాకు వైమానిక దళ మద్ధతు అవసరం’ అని వేర్పాటువాదులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
బుధవారం బీఎల్ఏ సహా మూడు వేర్పాటువాద గ్రూప్‌లు డేరాబుగ్టి ప్రాంతంలోని పాక్ ప్రభుత్వానికి చెందిన గ్యాస్ పైప్లైన్లపై, సరఫరా వాహనాలపై, సరఫరా మార్గాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో దాదాపు 100 బావులు ఉన్నాయని, పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నదని వెల్లడించారు.
ప్రత్యేక దేశంగా గుర్తించండి..
బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్థానికులు, వేర్పాటు వా దులు పాకిస్థాన్ జెండాలను తొలగించి బలూచిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని వేర్పాటువాదులు విజ్ఞప్తి చేశారు. ‘మేం స్వాతంత్య్రం పొందాం. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దేశంగా గుర్తించాలి. వెంటనే సభ్యదేశాలతో సమావేశం నిర్వహించి మద్దతు కోరాలి’ అని ప్రకటనలో కోరారు. దేశ భద్రత ఏర్పాట్లకు, అధికారిక పత్రాల తయారీ, పౌరులకు గుర్తింపు కార్డుల జారీకి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఐక్యరాజ్యసమితి శాంతి దళాన్ని తమ ప్రాంతానికి పంపాలని, పాకిస్థాన్ సైన్యం ఆయుధాలను ఇక్కడే వదిలేసి వైదొలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బలూచిస్థాన్‌లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, క్యాబినెట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. త్వరలోనే దేశ అవతరణ వేడుకలు నిర్వహిస్తామని, దీనికి మిత్ర దేశాలను ఆహ్వానిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
‘బలూచిస్థాన్ ప్రజలు పాక్ జెండాలను తొలగించి, సొంత జెండాలను ఎగురవేయడం మొదలు పెట్టారు. ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను బలూచిస్థాన్‌కు తరలించాల్సిన సమయం వచ్చింది. పాకిస్థాన్‌కు వీడ్కోలు.. బలూచిస్థాన్‌కు స్వాగతం’ అని బలూచ్ రచయిత మిర్ యార్ బలూచ్ గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బలూచిస్థాన్‌కు ‘ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ కుప్పకూలిన వార్త అతి త్వరలోనే వస్తుంది. మేము బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించుకుంటున్నాం. ఢిల్లీలో కొత్తగా బలూచిస్థాన్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ అనుమతించాలని కోరుతున్నాం’ అని విజ్ఞప్తి చేశారు.