Munir @ Army chief | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఖమర్ జావెద్ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా నియమితులైన ఆసిమ్ మునీర్‌కు బజ్వా కమాండ్ బ్యాటన్‌ను అందించారు. కమాండ్ బ్యాటన్‌ను అందుకోవడంతో ఆసిమ్ మునీర్ అధికారికంగా ఆర్మీ చీఫ్‌గా అయ్యారు. ఈ సందర్భంగా ఆసిమ్ మునీర్‌ను అభినందించిన బజ్వా.. మునీర్ హయాంలో పాకిస్తాన్ మంచి ప్రయోజనాలు పొందగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. మునీర్‌తో తన 24 ఏండ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌తో జనరల్ బజ్వా సమావేశమయ్యారు.
దీనికన్నా ముందు జనరల్ బజ్వాకు మరోసారి పదవి పొడగింపు అవకాశం ఇస్తారని భావించారు. అయితే, ఎనిమిది నెలలు గడిచిపోయినా ఆ ఊసే ఎత్తకుండా కొత్త చీఫ్‌ను నియమించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ అవుతున్నట్లు గత వారమే వెల్లడైంది. చేంజ్ ఆఫ్ బ్యాటన్ కమాండ్ సెర్మనీలో పాత ఆర్మీ చీఫ్ తన బ్యాటన్‌ను ఆర్మీ కొత్త చీఫ్‌కు అందజేస్తారు. దీనినే చేంజ్ ఆఫ్ స్టిక్ సెర్మనీ అని కూడా అంటారు. ఇలాఉండగా, కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇద్దరు సీనియర్ జనరల్స్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు జనరల్స్ కూడా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితులు కావడం విశేషం.
ఈ బ్యాటన్ ఒక ప్రత్యేకమైన కర్రతో తయారు చేయబడింది. ఈ కర్రను ‘మలక్క కేన్’ అంటారు. సైన్యంలో ఈ బ్యాటన్ చాలా ముఖ్యమైనది. ఈ కమాండ్ బ్యాటన్ ఒక చివర మెరిసే స్టీల్ హ్యాండిల్, మరొక వైపు మృధువైన గ్రిప్ హ్యాండిల్ ఉంటుంది. ఈ బ్యాటన్‌ను ఒక్క ఆర్మీ చీఫ్ ఒక్కరే కలిగి ఉంటారు. 2008 లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కమాండ్ బ్యాటన్‌ను జనరల్ అష్ఫాఖ్ పర్వేజ్ కయానీకి అందజేశారు. అనంతర కాలంలో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కయానీ ఆరేండ్లపాటు ఆర్మీ చీఫ్‌గా కొనసాగి.. తన చేతిలోని బ్యాటన్‌ను జనరల్ రషీల్ షరీఫ్‌కు అందించారు. షరీఫ్ మూడేండ్ల పాటు ఆర్మీ చీఫ్ పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన జనరల్ బజ్వాకు అందజేశారు. 2019 లో బజ్వా పదవీకాలం ముగియడంతో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో 3 ఏండ్లపాటు పదవీకాలం పొడగించారు.