న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఈ ఏడాది(2026లో) పట్టభద్రులయ్యే విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను నిలబెట్టుకోవడంలో విఫలమైన 22 కంపెనీలతో రానున్న రెండు ప్లేస్మెంట్ సీజన్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం సహకరించకూడదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు నిర్ణయించాయి. వచ్చే రెండేండ్ల పాటు ఐఐటీ ప్లేస్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి అనుమతించబోమని తెలియచేస్తూ ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ(ఏఐపీసీ) సంబంధిత కంపెనీలకు ఈనెల 30 నాటికి రాయనున్నది. ఈ చర్యను ‘బ్లాక్ లిస్టింగ్’ అని కాకుండా ‘సహాయ నిరాకరణ(నాన్ కోఆపరేషన్) అని పిలవాలని కమిటీ నిర్ణయించిందని ఏఐపీసీ కన్వీనర్, ఐఐటీ-గువాహటి అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ జోస్ తెలిపారు. కొన్ని కంపెనీలు ఒక్కొక్కటిగా 10 నుంచి 15 వరకు జాబ్ ఆఫర్లను వెనక్కి తీసుకున్నాయని ఆయన తెలిపారు. వివిధ ఐఐటీలు ఆయా సందర్భాలకు సంబంధించిన తాజా వివరాలను కమిటీకి తెలియచేస్తుండటంతో తుది జాబితా, ప్రభావితమైన ఆఫర్ల సంఖ్యను ఇంకా క్రోడీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు.
రెండేండ్ల నిషేధాన్ని ఎదుర్కోనున్న కంపెనీలలో ఒరాకిల్ కూడా ఉందని క్యాంపస్ వర్గాలు తెలిపాయి. ఐఐటీ విద్యార్థులకు ఇచ్చిన సుమారు 40 ఉద్యోగ ఆఫర్లను ఈ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ నిలబెట్టుకోలేదు. ఈ జాబితాలో అనేక స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నియామకాల కోసం ఒరాకిల్ ఐఐటీలను సంప్రదించలేదని జోస్ తెలిపారు.
ఉద్యోగ నియామక ఆఫర్లను ఉపసంహరించుకున్న లేదా జాప్యం చేసిన కంపెనీలు, ఐఐటీల మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ రెండేండ్ల నిషేధం విధించారు. ఒరాకిల్, ఇంటర్వ్యూ, కిక్‌స్టార్ట్, సూపర్ఏజీఐతో సహా 10కిపైగా కంపెనీలను తాము ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను నిలబెట్టుకోవాలని లేదా ప్రభావితమైన విద్యార్థులకు మూడు నెలల జీతానికి సమానమైన పరిహారం చెల్లించాలని జూన్‌లో ఏఐపీసీ హెచ్చరించింది. స్పందించడానికి కంపెనీలకు మొదట ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చిన కమిటీ ఆ గడువులోగా పరిష్కరించని పక్షంలో 2027, 2028 బ్యాచ్‌ల ప్లేస్మెంట్ డ్రైవ్‌ల నుంచి ఆయా కంపెనీలను మినహాయించవచ్చని హెచ్చరించింది. జాబ్ ఆఫర్లు పొందిన విద్యార్థులను విధుల్లోకి తీసుకోవడానికి కంపెనీలకు సెప్టెంబర్ 15ను గడువుగా ఏఐపీసీ నిర్ణయించింది.