హైదరాబాద్, డిసెంబర్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను డిస్ఇన్ఫెక్ట్ క్లీనర్లతో, చేతులను హ్యాండ్ వాష్, శానిటైజర్లతో మనం తరుచూ శుభ్రం చేసుకొంటూ ఉంటాం. ఐసీయూల్లో, ల్యాబ్‌లలో, స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్‌లో సూక్ష్మజీవుల రహిత వాతావరణం చాలా ముఖ్యం. దీంతో క్లీనింగ్ అనంతరం బయోసెన్సార్ తరహా డివైజ్లతో ఆయా ప్రాంతాలను తరుచూ చెక్ చేస్తూ ఉంటారు. అయితే, తాను బతికి ఉన్నప్పటికీ.. చనిపోయినట్టు టెర్షికోకస్ ఫెనిసిస్ వర్గం బ్యాక్టీరియాలు ఏమారుస్తాయట.
సెన్సార్లకు దొరక్కుండా తమ జీవక్రియలను కొంత కాలంపాటు నిలిపేసి.. చచ్చిన శవాల్లాగా నటిస్తాయట. అలా.. డిస్ఇన్ఫెక్ట్ క్లీనర్ల ప్రభావాన్ని తట్టుకొని సెన్సార్ల బారిన పడకుండా చచ్చి.. బతికిపోతాయట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ వివరాలు ‘మైక్రో బయాలజీ స్పెక్ట్రమ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.