మెక్సికో, నవంబర్ 27: మెక్సికోలో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ దవాఖానలో ఓ ఆడ శిశువు 2 అంగుళాల తోకతో జన్మించింది. మృదువైన చర్మంతో, పదునైన మొన కలిగి 3-5 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఈ తోక ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆ తోక స్పర్శను కలిగి ఉండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వెల్లడించారు. ఆ తోకను ఆపరేషన్ చేసి తొలగించామని, ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉన్నదని వివరించారు. ఇప్పుడు ఈ తోక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ‘ట్రూ టెయిల్స్’ అత్యంత అరుదుగా జరుగుతాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటివి 2017 నాటికి 195 కేసులు గుర్తించారు. 2021లో ఒక బ్రెజిలియన్ శిశువు కూడా తోకతో జన్మించింది.