కీవ్: మూడవ రోజు కూడా కీవ్ నగరంపై బాంబుల వర్షం కొనసాగుతూనే ఉన్నది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చినట్లు టెటిగ్రామ్ యాప్‌లో కొందరు ఈ విషయాన్ని షేర్ చేశారు. మెట్రో స్టేషన్లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌లను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
ఇక సుమారు 50 లక్షల మంది ఉక్రెనియన్లు విదేశాలకు తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. రష్యా దాడుల వల్ల ఇప్పటికే లక్ష మంది చెల్లాచెదురయ్యారు. పోలాండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాలకు ఉక్రెయిన్ శరణార్థులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్లోకి ప్రవేశించారు.