Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఇప్పటి వరకు మరణించిన హమాస్ మిలిటెంట్లలో ఆయ్మన్ నొఫాల్ కీలకమైన హమాస్ కమాండర్ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై రెండు యాంటీ ట్యాంగ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు, మరో పౌరుడు గాయపడ్డారని పేర్కొంది. మరో వైపు దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది.
అయితే, ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇప్పటికే దాదాపు 10లక్షల మందికిపైగా ఉత్తరగాజాను వీడారు. వీరంతా దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానక దాడులు జరిపింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల కారణంగా 2800 మంది ప్రాణాలు కోల్పోగా.. 10వేల మందికిపైగా గాయపడ్డారు. హమాస్ వైపు రాకెట్లను ఇజ్రాయెల్ వైపు ప్రయోగిస్తుండడంతో.. ఇజ్రాయెల్ సైతం వైమానిక దాడులు కొనసాగిస్తున్నది.