Jeremy Renner | హాలీవుడ్ నటుడు, అవెంజర్స్ సిరీస్‌తో పాపులర్ అయిన జెరెమీ రెన్నెర్.. కొత్త సంవత్సరం రోజున ఘోర ప్రమాదానికి గురయ్యారు. తన ఇంటి వెలుపల మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం విమానంలో దవాఖానకు తరలించారు. ఆయన వెంట దవాఖానలో కుటుంబసభ్యులు ఉన్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన అభిమానులు ఆయన క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
జెరెమీ రెన్నర్ అమెరికాలోని రెనో నివాసి. అతని ఇల్లు మౌంట్ రోజ్ స్కీ తాహో ప్రక్కనే ఉన్నది. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురిసింది. హిమపాతం కారణంగా ఉత్తర నెవాడాలోని దాదాపు 35 వేల ఇళ్లలో విద్యుత్తు దెబ్బతిన్నది. రెండు రోజులుగా అక్కడి వారు చీకట్లోనే ఉంటున్నారు. కాగా, జెరెమీ రెన్నర్ తన ఇంటి బయట గడ్డకట్టిన మంచును తొలగించడానికి బయటకు వెళ్లాడు. ఇంతలో అతనికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి తక్కువ సమయంలో మంచి ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నదని, అయితే స్థిరంగా ఉన్నదని జెరెమీ రెన్నర్ అధికార ప్రతినిధి తెలిపారు. జెరెమీ రెన్నర్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. మార్వెల్ ఎవెంజర్స్ సిరీస్‌లో హాక్ ఐ క్యారెక్టర్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనకు ఇండియాలో కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. గత ఏడాది మేలో ఆయన ఇండియా వచ్చారు. ‘మిషన్ ఇంపాజిబుల్ – ఘోస్ట్ ప్రోటోకాల్’ లో అనిల్ కపూర్‌తో కలిసి జెరెమీ రెన్నర్ నటించారు.