న్యూఢిల్లీ, జూన్ 20: టెహ్రాన్‌లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది. క్షిపణి భాగాలను తయారుచేసే సైనిక పారిశ్రామిక ప్రదేశాలపైన, క్షిపణి ఇంజిన్ల కోసం ఉపయోగించే ముడి పదార్థాలను తయారు చేసే ప్రదేశాలపైన ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది. ఏళ్ల తరబడి వీటిని ఇరాన్ నిర్మించుకుందని, ఇరాన్ రక్షణ శాఖకు, అణు కార్యక్రమానికి ఈ పారిశ్రామిక కేంద్రం అత్యంత కీలకమని తెలిపింది. వీటితోపాటు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందు కోసం అధునాతన ఆయుధాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉపయోగించే టెహ్రాన్‌లోని ఎస్పీఎన్డీ కేంద్ర కార్యాలయంపైన కూడా ఫైటర్ జెట్లు దాడి చేశాయని తెలిపింది.
ఇజ్రాయెల్‌పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్‌లోని మూడు క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. వాటిని ప్రయోగించడానికి పనిచేస్తున్న సైనిక కమాండ్ర్పై కూడా దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి దూసుకువస్తున్న ఇరాన్ క్షిపణులను విజయవంతంగా నిర్వీర్యం చేస్తున్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి చెప్పారు. ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెలీ ఫైటర్ జెట్లు, వైమానికి దళానికి చెందిన విమానాలు స్వేచ్ఛగా తిరుగుతూ పశ్చిమ, సెంట్రల్ ఇరాన్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరాన్ గగనతలంపై తమ వైమానిక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తూ గగనతల ఆధిపత్యాన్ని సాధిస్తామని ఆయన ప్రకటించారు.