Navy Plane Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని గాల్వెస్టన్ సమీపంలో మెక్సికన్ నేవీకి చెందిన చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. యాక్సిడెంట్లో గాయపడిన వారిని వైద్యం కోసం తరలిస్తున్న సమయంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో నలుగురు మెక్సికన్ నేవీకి చెందిన సిబ్బంది కాగా, మిగతా నలుగురు సాధారణ పౌరులు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చికిత్స కోసం తరలిస్తుండగా విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. విమానం కూలిపోయిన వెంటనే అమెరికా కోస్ట్ గార్డ్, స్థానిక పోలీసు విభాగాలు, అత్యవసర సేవా బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాల్వెస్టన్ బే ప్రాంతంలో విజిబులిటీ తక్కువగా ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అసలు కారణంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. కాగా, మృతుల కుటుంబాలకు మెక్సికన్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.