Bangladesh | ఢాకా, ఆగస్టు 4: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస రాజుకుంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్‌తో విద్యార్థులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. దీంతో మొదటి రోజైన ఆదివారం నిరసనకారులకు, అధికార అవామీ లీగ్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణల్లో 91 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. ఆందోళనకారులను అవామీ లీగ్‌తో పాటు ఛత్ర లీగ్, జుబో లీగ్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరస్పరం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారత విద్యార్థులు, పౌరులు భారత హై కమిషన్‌తో టచ్‌లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తాము ఇచ్చిన ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అసిస్టెంట్ హై కమిషన్ ఎక్స్‌లో విజ్ఞప్తి చేసింది. అల్లర్లు పెచ్చుమీరడంతో ఆదివారం సాయంత్రం నుంచి దేశ వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. సామాజిక మాధ్యమాలను నిలిపి వేయాలని, 4జీ మొబైల్ ఇంటర్నెట్ను షట్‌డౌన్ చేయాలని ఆదేశించింది. కాగా, హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులను ప్రకటించింది.
ఆందోళనకారులతో చర్చలకు ప్రధాని ఆహ్వానించినా విద్యార్థులు తిరస్కరించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులు అంటూ ప్రధాని హసీనా తీవ్రంగా విమర్శలు చేశారు. ఆందోళనల కారణంగా ఢాకాలోని దుకాణాలు, మాల్స్ మూసివేశారు. దేశంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆందోళనకారులు కర్రలు చేతబూని ప్రైవేట్ కార్లు, అంబులెన్స్‌లు, బస్సులు, బైక్‌లు, ఇతర వాహనాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. వారు దవాఖానలపై కూడా దాడులు చేయడంతో రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి, సిటీ మేయర్ గృహాలపై కూడా విరుచుకుపడ్డారు. పలు భవనాలను ధ్వంసం చేయడమే కాక పోలీస్ వాహనాలను దగ్ధం చేశారు. సోమవారం భారీ ప్రదర్శన, సామూహిక బైఠాయింపు జరుపుతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నహీద్ ఇస్లామ్ ప్రకటించారు.