మాస్కో: రష్యాలో బెలారస్‌కు చెందిన కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులు బెలారస్, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందినవారుగా రష్యా అధికారులు గుర్తించారు. బెలారస్ వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 విమానం రష్యాలోని తూర్పుసెర్బియాలో ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తూర్పుసెర్బియాకు చేరుకున్న విమానం ముందుగా ఒకసారి ల్యాండింగ్ చేసే క్రమంలో విఫలమైందని, రెండోసారి మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా కూలిపోయిందని రష్యా మీడియా పేర్కొన్నది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై తూర్పుసెర్బియా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.