Burkina Faso | అబుజా(నైజీరియా), ఆగస్టు 26: అంతర్యుద్ధంతో సతమతమవుతున్న బుర్కినా ఫాసోలో మళ్లీ హింస చెలరేగింది. బర్సాలోగో పట్టణం వద్ద అల్‌ఖైదాకు చెందిన జిహాదీలు ఊచకోతకు పాల్పడ్డారు. జిహాదీ గ్రూప్ జరిపిన తుపాకీ కాల్పుల్లో కనీసం 100 మంది చనిపోయారని, మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్ స్పెషలిస్ట్ ఒకరు తెలిపారు. బర్సాలోగో వద్ద శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి కందకాలు తవ్వుతుండగా, అల్‌ఖైదాకు చెందిన జిహాదీ గ్రూప్ ‘జేఎన్ఐఎమ్’ ఫైటర్లు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని.. కాల్పులకు తెగబడ్డారని సెక్యూరిటీ థింక్ ట్యాంక్ నిపుణుడు వాజిం నాజర్ తెలిపారు. ఈ దాడి తామే చేశామని, బర్సాలోగో పట్టణంపై పట్టుసాధించామని అల్‌ఖైదా ప్రకటించకుంది. దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేదు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు చనిపోయారు. వైమానిక, పదాతి దళంతో దాడిని ఎదుర్కొంటున్నాం’ అని రక్షణ మంత్రి చెప్పారు.
సియోల్: రష్యాలో తయారైనదిగా చెప్తున్న సూసైడ్ డ్రోన్‌ను దేశాధినేత కిమ్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా పరీక్షించినట్టు ఆ దేశ మీడియా సోమవారం పేర్కొంది. శత్రువు కదలికలపై వ్యూహాత్మక భూతల పర్యవేక్షణ, బహుళ విధ అవసరాల కోసం మరిన్ని సూసైడ్ డ్రోన్లను అభివృద్ధి, ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని కిమ్ జోంగ్ అన్నట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.