Sheikh Hasina | బంగ్లాదేశ్ ప్రధానిగా ఉద్వాసనకు గురైన షేక్ హసీనా ఎక్కడ ఆశ్రయం పొందుతారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రధానిగా ఉద్వాసనకు గురి కాగానే ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా.. తన శాశ్వత నివాస కేంద్రంపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తొలుత లండన్ లో ఆశ్రయం పొందాలని భావించినా.. ఆమెకు శరణార్థిగా ఆశ్రయం కల్పించేందుకు సానుకూల నిబంధనలేమీ లేవని బ్రిటన్ తేల్చి చెప్పిసింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా.. తన కుటుంబ సభ్యులు నివసిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫిన్లాండ్, భారత్‌ల్లో కంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఆశ్రయం పొందే అవకాశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు అమెరికా, బ్రిటన్, ఫిన్లాండ్ దేశాల్లో ఆశ్రయంపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం తన సోదరి షేక్ రెహానా సిద్దిఖ్ తో కలిసి భారత్ కు చేరుకున్న షేక్ హసీనా.. వెంటనే శరణార్థి హోదా కోసం బ్రిటన్ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కానీ, బ్రిటన్ ప్రభుత్వాధికారులు బ్రిటనేతర వ్యక్తులకు ఆశ్రయం కల్పించడానికి గానీ, తాత్కాలిక శరణార్థి హోదా కల్పించడానికి నిబంధనలేమీ లేవని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ భద్రత అవసరమైన షేక్ హసీనా వంటి వారు నివసించడానికి భారత్ మాత్రమే సురక్షిత ప్రదేశం అని పేర్కొన్నారు. బ్రిటన్ రెగ్యులర్ వీసా కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారా? లేదా? అన్న విషయం చెప్పడానికి నిరాకరించారు.
షేక్ హసీనా సోదరి షేక్ రెహానాకు బంగ్లాదేశ్ ద్వంద్వ సభ్యత్వ చట్టాలకు అనుగుణంగా బ్రిటన్ పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు. ఇక షేక్ రెహానా కూతురు తులిప్ సిద్ధిఖి ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు. లేబర్ పార్టీ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారు. తులిప్ సిద్ధిఖి ప్రభావం మాటెలా ఉన్నా.. షేక్ హసీనా ప్రత్యర్థి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తుందా? అన్న సందేహంలో బ్రిటన్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.