హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో వొడ్కాకు (Vodka) చిక్కొచ్చిపడింది. ఎక్కడో ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేస్తే వొడ్కాకు వచ్చిన నష్టమేమిటి అనుకుంటున్నారా.. అవును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పిరిట్‌పై కెనడా, అమెరికాలోని పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఇప్పటికే ఆయా స్టోర్లలోని రష్యన్ ఉత్పత్తులు, రష్యన్ బ్రాండ్ స్పిరిట్లను తొలగించాలని నిర్ణయించాయి.
అమెరికాలోని న్యూ హ్యాంప్షేర్, ఓహియో రాష్ట్రాలు రష్యాలో తయారైన, రష్యన్ బ్రాండ్ స్పిరిట్లను అమ్మకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు హాంప్‌షేర్ గవర్నర్ క్రిస్ సునును, ఓహియో గవర్నర్ ప్రకటించారు. రష్యన్ స్టాండర్డ్ వొడ్కాపై నిషేదం విధిస్తున్నామని ప్రకటించారు. ఓహియోలోని 487 లిక్కర్ ఏజెన్సీల్లో రష్యన్ మేడ్ వొడ్కా బాటిళ్లు 6400 ఉన్నాయని, ఆయా స్టోర్ల నుంచి వాటిని తొలగించాలని ఆదేశించామని గవర్నర్ మైక్ డివైన్ చెప్పారు.
ఇక రష్యా నుంచి పెద్దమొత్తంలో ఆల్కహాల్ బేవరేజెస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో కెనడా ఒకటి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రష్యన్ వొడ్కా, రష్యాలో తయారైన ఆల్కహాలిక్ బేవరేజెస్‌ను అమ్మకూడదని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో మనిటోబా, న్యూఫౌంట్ల్యాండ్, ఓంటారియో, లాబ్రడార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ఒంటారియోలోని 679 స్టోర్లలో రష్యాకు చెందిన అన్ని లిక్కర్ ఉత్పత్తులను తీసివేసినట్లు అధికారులు వెల్లడించారు. న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్ కూడా రష్యాకు చెందిన లిక్కర్ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. కెనడా గతేడాది రష్యా నుంచి 3.78 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆల్కహాల్ బేవరెజెస్ను దిగుమతి చేసుకుంటున్నది. ఆ దేశంలో విస్కీ తర్వాత స్పిరిట్ అత్యధికంగా అమ్ముడవుతున్నది.